మంథనిలో సైబర్ నేరం.. కేవైసీ పేరుతో రూ.30 వేలు స్వాహా.
జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 26:
మీ బ్యాంకు ఖాతా కేవైసీ పెండింగ్ లో ఉందని, వెంటనే అప్ డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అవుతుందంటూ వచ్చిన నకిలీ వాట్సాప్ సందేశాన్ని నమ్మి ఓ వ్యక్తి రూ.30 వేలు పోగొట్టుకున్న ఘటన శనివారం మంథనిలో చోటుచేసుకుంది.మంథని పట్టణానికి చెందిన దేనవేన రమేష్ కు శనివారం సాయంత్రం యూనియన్ బ్యాంక్ లోగోతో వాట్సాప్ లో ఓ సందేశం వచ్చింది. “మీ ఖాతాకు సంబంధించిన కేవైసీ పెండింగ్ ఉంది, ఖాతా బ్లాక్ చేయబడుతుంది” అని హెచ్చరికతో కూడిన మెసేజ్ చూసి ఆందోళన చెందిన రమేష్ అందులో ఉన్న లింక్ పై క్లిక్ చేశాడు. వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ చేసి మరో లింక్ పంపి వివరాలు నమోదు చేయాలని కోరాడు. దీంతో రమేష్ తన ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్ ను అవతలి వ్యక్తికి చెప్పాడు. నిమిషాల వ్యవధిలోనే అతని ఖాతా నుండి రూ.30 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన రమేష్ వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బ్యాంకులు ఎప్పుడూ లింక్ పంపవు:
ఎవరైనా బ్యాంకు పేరుతో కేవైసీ అప్ డేట్ చేయమని వాట్సాప్ లో లింక్ లు పంపితే క్లిక్ చేయవద్దని, ఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీ ఎవరికీ చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments