EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

ఫేక్ కొడుకు.. సాధువుగా ఎంట్రీ..!

📰 Generate e-Paper Clip

ఫేక్ కొడుకు.. సాధువుగా ఎంట్రీ..!

24 ఏళ్ల తర్వాత ‘నాన్నా’ అంటూ డ్రామా.. 8 ఎకరాల పొలం కోసం టార్గెట్..!

రూ.40 లక్షలు టోకరాకు ప్లాన్.. డిఎన్ఏ టెస్ట్‌తో అసలు గుట్టు వెలుగులోకి..!

ఇబ్రహీంపట్నంలో సంచలనం.. ఆస్తి కోసం కొడుకుగా నటించిన వ్యక్తి.

జనం వాయిస్, రంగారెడ్డి, అక్టోబర్ 1:

24 ఏళ్లుగా కొడుకు కోసం ఎదురుచూస్తున్న ఆ తండ్రికి.. ఒక్కసారిగా తన కొడుకు కళ్లముందు కనిపించాడు. సాధువు వేషంలో ప్రత్యక్షమైన వ్యక్తిని ‘నీ కొడుకే’ అంటూ పరిచయం చేయడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 8 ఎకరాల భూమిని టార్గెట్ చేసి.. రూ.40 లక్షలు వసూలు చేసేందుకు వేసిన ప్లాన్.. డిఎన్ఏ టెస్ట్ మాటతో బట్టబయలైంది.

*24 ఏళ్లుగా కొడుకు కోసం ఎదురుచూపులు..*

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటకు చెందిన పిషపాటి లక్ష్మారెడ్డికి ఐదుగురు కూతుళ్ల తర్వాత ఒక్కగానొక్క కొడుకు శ్రీనివాస్‌రెడ్డి. 2002లో టెన్త్‌లో ఫెయిల్ కావడంతో తండ్రి మందలించగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో తండ్రి 24 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు.

*ఫేక్ కొడుకు.. సాధువుగా ఎంట్రీ* ..

ఈ విషయం తెలుసుకున్న మోహన్‌రెడ్డి అనే వ్యక్తి సెప్టెంబర్ 16న లక్ష్మారెడ్డికి పరిచయమయ్యాడు. ‘నీ వారసుడు వచ్చాడు’ అంటూ నమ్మబలికాడు. సెప్టెంబర్ 20న చెరువుగట్టు గుడి వద్దకు తీసుకెళ్లి.. మాల వేసుకుని సాధువు వేషంలో ఉన్న నకిరేకల్‌కు చెందిన యాదయ్యను చూపించాడు.
‘ఇతడే నీ కొడుకు శ్రీనివాస్‌రెడ్డి’ అంటూ పరిచయం చేశాడు.
దీంతో 24 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని లక్ష్మారెడ్డి భావించాడు. యాదయ్య కూడా ఫోన్‌లో ‘నాన్నా.. నాకు పెళ్లయింది.. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు’ అంటూ మాట్లాడటంతో తండ్రి పూర్తిగా నమ్మాడు.

*8 ఎకరాల పొలం కోసం.. టార్గెట్!*

కొడుకు తిరిగొచ్చాడన్న ఆనందంతో ఉన్న లక్ష్మారెడ్డి కుటుంబాన్ని.. ఆస్తి వ్యవహారంలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు బాధితులు ఆరోపించారు. 8 ఎకరాల భూమిపై కన్నేసి.. నకిలీ వారసుడిని తెరపైకి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

*రూ.40 లక్షలు టోకరాకు ప్లాన్!*

సెప్టెంబర్ 22న మోహన్‌రెడ్డి లక్ష్మారెడ్డి ఇంటికి వచ్చి.. ‘నీ కొడుకు మాలలో ఉన్నాడు.. మాల తీయించాలి.. సమ్మక్క-సారక్క జాతరకు తీసుకెళ్లాలి.. రూ.40 లక్షలు ఖర్చవుతుంది’ అంటూ డబ్బులు డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డబ్బుల డిమాండ్‌తో కూతుళ్లకు డౌట్ వచ్చింది.
వరుసగా డబ్బులు అడుగుతుండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. మాటల్లోనూ, వ్యవహారంలోనూ తేడాలు కనిపించడంతో అసలు విషయం తేల్చుకోవాలని నిర్ణయించారు.

*డిఎన్ఏ టెస్ట్ మాటతో.. డొంక కదిలింది!*

సెప్టెంబర్ 27న సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని భరత్ గార్డెన్స్ వద్దకు యాదయ్యను రప్పించారు. ‘DNA టెస్ట్ చేయిస్తాం.. అసలు నువ్వెవరో తేలిపోతుంది’ అంటూ నిలదీశారు. దీంతో భయపడిన యాదయ్య చివరకు నిజం ఒప్పుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
‘మోహన్‌రెడ్డి చెప్పడంతోనే కొడుకులా నటించా’
మోహన్‌రెడ్డి చెప్పడం వల్లే డబ్బుల కోసం శ్రీనివాస్‌రెడ్డిగా నటించానని యాదయ్య అంగీకరించినట్లు బాధితులు పేర్కొన్నారు. దీంతో 24 ఏళ్ల తర్వాత కొడుకు వచ్చాడన్న కథ.. చివరకు ఫేక్ డ్రామాగా తేలింది.

*పోలీసుల దర్యాప్తు..*

ఘటనపై బాధితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? ఆస్తి కోసం పక్కా స్కెచ్ వేశారా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!