ఇంచార్జీ మంత్రి ఇలాకాలోనే అక్రమ భూ దందా..!
- మహబూబాబాద్‌లో బరితెగించిన భూమాఫియా
- కబ్జా కోరల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు!
- పట్టించుకోని జిల్లా యంత్రాంగం.. అధికారుల అండదండలతోనే అక్రమ కట్టడాలు?
- కురవిలో మాయమైన 275 ఎకరాల సర్కారు భూమి!
- కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా.. లోకాయుక్తను ఆశ్రయించిన సామాజికవేత్తలు
- కలెక్టరెట్ లో ఓ అధికారి మంతనాలు..?
మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (జనం వాయిస్) :
మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో భూమాఫియా రెచ్చిపోతోంది. పాలకుల అండదండలు, అధికారుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకుపోతున్నాయి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ, నిషేధిత, సీలింగ్, భూదాన్ భూములను సైతం వదలకుండా అక్రమార్కులు వెంచర్లు, కట్టడాలుగా మారుస్తున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి ఆక్రమించబడిందా? లేదా రికార్డుల్లోనే సమస్య ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఆరోపణలు చేస్తున్న వారు కాదు.. సంబంధిత రెవెన్యూ అధికారులు.
వందల కోట్ల విలువైన 107 సర్వే నంబర్ భూమి ఆక్రమణ!
మహబూబాబాద్ పట్టణంలోని 107 సర్వే నంబర్‌లో ఉన్న 1 ఎకరా 34 గుంటల వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై కాంగ్రెస్ నాయకుడు ఓం నారాయణ భారీ స్థాయిలో అక్రమ కట్టడాలు నిర్మించారని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపితే సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణల గుట్టు రట్టవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ రాష్ట్ర ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ కబ్జాలపై స్పందించి, ప్రభుత్వ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని వివిధ ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మళ్లీ తెరపైకి ‘ఆర్తి రెడ్డి గార్డెన్’ వివాదం.. లోకాయుక్తకు ఫిర్యాదు.
గుమ్ముడూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 287లో గల 7 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని శ్రీ రామాసహాయం వెంకట్ రెడ్డి ఆక్రమించినట్లు 2012లోనే సర్వే అధికారులు తేల్చి, ఆర్తి గార్డెన్‌ను సీజ్ చేశారు. అయితే, ఈ కోట్ల రూపాయల విలువైన భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవడంతో, సామాజికవేత్త గండమల్ల రామకృష్ణ రాష్ట్ర లోకాయుక్త కోర్టును ఆశ్రయించారు. మరోవైపు పట్టణంలోని పూర్వకాలపు చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్సారెస్పి కాల్వలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని, వెంటనే సమగ్ర సర్వే చేపట్టి వీటిని కాపాడాలని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు దార్ల శివరాజ్ డిమాండ్ చేశారు.
కదలని రెవెన్యూ యంత్రాంగం.. రైతుల ఆందోళన.
నిషేధిత, భూదాన్, సీలింగ్, మిగులు భూముల సమస్యలపై టీడీపి మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డిఆర్డీఓ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
కురవిలో 275 ఎకరాల సర్కారు భూమి మాయం!
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో భూమాఫియా ‘కబ్జా’ శఠగోపం పెట్టింది. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నా, క్షేత్రస్థాయిలో హద్దులు లేకుండా 275 ఎకరాల 20 గుంటల భూమి పెద్దల చేతుల్లో బందీ అయింది. ఇందులో: 43 ఎకరాల 09 గుంటల అబాది భూములు, 158 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూములు, 11 ఎకరాల 19 గుంటల సీలింగ్ భూములు, పి. ఓ. టి 57 ఎకరాల 35 గుంటలు, 4 ఎకరాల భూదాన్ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సర్వే నంబర్ 177 దాని బై నంబర్లపై సమగ్ర సర్వే జరపాలని సీపీఐ నేతలు, దళిత సంఘం నాయకులు, డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 852 పరిధిలో 70 ఏళ్లుగా గుట్టగా ఉన్న స్థలాన్ని అనుమతులు లేకుండా చదును చేసి, ఒకే ఇంటి నంబర్‌పై ఏకంగా 7 రిజిస్ట్రేషన్లు చేయడం ఇక్కడి రెవెన్యూ అధికారుల లీలలకు అద్దం పడుతోంది.
సర్వేకు జాప్యమెందుకు..?
కురవి భూములను పరిశీలించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వారమైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ భూములకు రక్షణగా తక్షణమే బోర్డులు ఏర్పాటు చేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఐతే విశ్వసనీయత సమాచారం జిల్లా కలెక్టరేట్లో ఓ అధికారి కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా మంతనాలు జరిపినట్లు తెలిసింది.
భూ అక్రమణపై రోజుకో పిర్యాదు:
కురవి మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన ఎరుకల (ఎస్టీ) కుటుంబం నివాస స్థలంపై వివాదం నెలకొంది. గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని నిమ్మశెట్టి వెంకన్న ఆరోపించారు. సర్వే నంబర్లు 852, 834లోని అబాది భూమికి ఏ. లక్ష్మీనారి, ఏ. సంతోష్, ఏ. వీరన్న, ఏ. సత్యం, ప్రెస్ నవీన్ తదితరులు పట్టాలు పొందినట్లు తనకు తెలిసిందని, తన ఇంటిని కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నివాసానికి విద్యుత్ మీటర్, మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఉన్నాయని తెలిపారు. పట్టాల మంజూరుపై సమగ్ర విచారణ జరిపి, విచారణ పూర్తయ్యే వరకు తన ఇంటికి రక్షణ కల్పించాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెంకన్న తెలిపారు. ఇలా జిల్లాలో రోజుకో పిర్యాదు వస్తున్న అధికార యంత్రాంగం ఉలుకుపలుకు లేదు. జిల్లా ఇంచార్జి మంత్రి స్పందించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు, బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments