- మంచిర్యాల ఎగ్జిబిషన్‌లో ‘కాశ్మీర్ జలకన్య’ దోపిడీ.!
- టికెట్ ధర అడిగితే నిర్వాహకుల దురుసుతనం. సామాన్యుల జేబులకు చిల్లులు.
- అనుమతులు లేకున్నా ఇష్టారాజ్యంగా వసూళ్లు.. తనిఖీలు చేపట్టాలని డిమాండ్.
- జనం వాయిస్, మంచిర్యాల ప్రతినిధి, మే 22:
- మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో నిఘా నిద్రపోతుండటంతో కొందరు నిర్వాహకులు నిలువు దోపిడీకి తెరలేపారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో “కాశ్మీర్ జలకన్య” పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ సామాన్య ప్రజలను దగా దండుకుంటున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- టికెట్లపై ధరలుండవు.. అడిగితే దురుసు ప్రవర్తన!
- వినోదం కోసం కుటుంబాలతో సహా వచ్చే సామాన్య ప్రజల జేబులకు నిర్వాహకులు చిల్లులు పొడుస్తున్నారు. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, ఎంట్రీ మరియు రైడ్స్ టికెట్లపై ఎలాంటి ధరలు ముద్రించకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక ప్రదర్శించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం టికెట్లపై అసలు ధరే ఉండటం లేదు. ఒకే రైడ్‌కు ఒకరి వద్ద ₹50 తీసుకుంటే, మరొకరి వద్ద ₹100 గుంజుతున్నారు. ఈ ధరల వ్యత్యాసాన్ని గమనించి ఎందుకు అని ప్రశ్నించిన సందర్శకులపై సదరు సిబ్బంది కనీస మర్యాద లేకుండా, అత్యంత దురుసుగా ప్రవర్తిస్తుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు లేని ఈ టికెట్ల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సైతం తెగ వైరల్ అవుతున్నాయి.
- అధికారుల ఉదాసీనత.. స్థానికుల డిమాండ్.
- పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఇంత బహిరంగంగా అక్రమ దందా సాగుతున్నా.. మున్సిపల్, రెవెన్యూ, తూనికలు-కొలతల శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ ఎగ్జిబిషన్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా టికెట్లపై కచ్చితంగా ధరలు ముద్రించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను దోచుకుంటున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల ప్రజలు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments